Tuesday, November 3, 2009

శుభము



శుద్ధంగా సుప్రభాతపు సాంబ్రాణిలా,
గదులన్నీ కలియదిరిగిన సన్న గజ్జెల మేల్కొలుపు
గుండెచప్పుళ్ళకు కృతజ్ఞతగా నలిచిన మరువపు కొమ్మంత కమ్మని ఉదయప్రార్ధనలు
రాలిన ఉసిరి పూలతో పోటీపడే నీ చేతి కొబ్బరి ఈనెలు ---------( చీపిరి )
తడారని ప్రేమకు మరల విరగబూసిన తెల్లచేమంతులు
గిన్నెలకు సరిగమలు నేర్పుతూ చేతి మట్టి గాజులు
అలసి సర్దిన ముంగురుల ధాటికి ముద్దుగా వొణికే చెవి బుట్టలు
మునివేళ్ళ మాయలా మూరెడు దారానికి పూచిన పూలపేటలు
నిదుర కౌగిట్లోకి జార్చేందుకు నువు తురిమిన విరజాజుల జోలపాటలు

మగతగా వినిపించే కీచురాళ్ల గుసగుసల మధ్య ఊపిరంత వెచ్చని వేసవి గురుతులు

ఆకాశపు పండక్కి ముస్తాబైన జాబిల్లికూనలు చుక్కలు
మేఘాలను తోసుకుంటూ జాబిలమ్మ జిలుగులు
నీ పక్క ఒరిగిన నా కోసం వెన్నెలల్లే జారిన చిరునవ్వు
వాలే రెప్పల మీదుగా నా తల నిమిరే నువ్వు
జీవితమంతా ఈ ఒక్క క్షణంగా మారిపోవాలనే తీరని ఆశ
మాటల కోటలకు అందని ఈ స్పర్శను వర్ణించే ఓడిన ప్రయాస
అమ్మను సృష్టించిన అమృత హస్తాలకు .. ఇష్ట బానిస ...

--------.J